పాలకపక్షంపై ప్రతిపక్షం ఆరోపణలు చేయడం సహజం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర చాలా కీలకమైనది. ప్రతిపక్షం ఎంత సమర్ధవంతంగా, ఎంత అలెర్ట్ గా ఉంటే ప్రభుత్వ పనితీరు అంత మెరుగ్గా ఉంటుంది. పాలకపక్షం తప్పులు చేస్తుందని కాదు. పాలనలో తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. అందుకే ప్రతిపక్షం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను ఎండగడుతూ ఉండాలి.
అయితే టీడీపీ విషయంలో ప్రతిపక్షం అంటే వేరు. తాను పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు లేదు అంటుంది. తానే ప్రతిపక్షంలో ఉంటే నిత్యం అసత్య ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతోంది. అందుకే బురదజల్లి కడుక్కోమనే పద్దతి అనుసరిస్తోంది.
తప్పులు జరిగితే, అవినీతి జరిగితే ఆరోపణలు చేయడం, విమర్శించడం సహజమే కానీ, తప్పులు చేసి వాటిని పాలకపక్షానికి అంటగట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్రలు చేయడం, తిరిగి ఆరోపణలు చేయడం ఇప్పుడు ప్రతిపక్షంగా టీడీపీ చేస్తున్నపని.
దేవాలయాలపై దాడులు లేదా విధ్వంసకర చర్యలు ఈ కోవలోకే వస్తాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలే దేవాలయాలపై దాడులు చేయడం, లేదా దేవతా విగ్రహాలు ధ్వంసం చేయడం తిరిగి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయింది.
ఎక్కడ, ఏ రూపంలో ఎలాంటి కుట్రలు అయినా చేయడం తిరిగి అధికార పార్టీపై, రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై ఆరోపణలు చేయడం పరిపాటి అయింది.
తాజాగా డ్రగ్స్ రవాణా విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే టీడీపీ నేతలు అధికారపార్టీపై, ముఖ్యమంత్రిపై, రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలంతా డ్రగ్స్ రవాణా అంశాన్ని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై ఆరోపణలు చేశారు.
ప్రభుత్వంలోని పెద్దలు, పోలీసులు కలిసే డ్రగ్స్ రవాణా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, తన ఆరోపణలకు ఆధారాలు చూపాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాను చేసిన ఆరోపణలకు ధూళిపాళ నరేంద్ర ఆధారాలు చూపాలి. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాంటి సత్సంప్రదాయాన్ని టీడీపీ నాయకత్వం పాటిస్తుందా లేక ఆధారాలు చూపం, ఆరోపణలు మాత్రమే చేస్తాం అంటూ తన విధానాన్ని కొనసాగిస్తుందా చూడాలి.