“దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం!
దీపేన హరతే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే!” అన్నారు పెద్దలు.
ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి పర్వదినంగా దేశమంతటా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగరోజు.
దసరా పండుగలాగే దీపావళి కూడా అధర్మంపై ధర్మం గెలుపొందినందుకు, దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిగినందుకు ఆనందంతో జరుపుకునే పర్వదినంగా పవిత్రతను సంతరించుకుంది. నరక చతుర్ధశి , దీపావళి అమావాస్య అంటూ రెండురోజులు పండగ జరుపుకోవటం సాంప్రదాయం.
దీపావళి ముందురోజు నరకాసురుడనే రాక్షస వధ జరిగింది ద్వాపరయుగంలో. దుష్టశిక్షణార్ధం శ్రీకృష్ణుడుగా అవతరించిన శ్రీమహావిష్ణు తానే స్వయంగా నరకుడిని వధించకుండా ,అతనితో యుద్ధం చేయడానికి తనతో సత్యభామను కూడా తీసుకువెళుతాడు. అందుకు కారణం నరకుని చావు సత్యభామ చేతిలో వుండటమే.
స్త్రీ శక్తి స్వరూపిణి. ఆది శక్తి అపరావతారం స్త్రీ. దాన్ని సూచన ప్రాయంగా చెప్పడమే ఇందులో అంతరార్ధం కావచ్చు.
ఇందులో మరో కథ ఉంది. పురాణాల ప్రకారం నరకుడు సత్యభామకు కుమారుడవుతాడు. లోకకంటకుడైన పుత్రుని వధించినందుకు బాధపడలేదు సత్యభామ.
అతని పేరు, చరితం శాశ్వతం కావాలని కోరింది స్వామిని. తప్పు చేసిన వాడు ఎవరైనా క్షమించేది ఉండదనే సందేశం దీపావళి పండగ ఇస్తుంది.
దుఃఖం సుఖం రెంటినీ కలుపుతూ అమావాస్య నాడు వచ్చే వెన్నెల రోజు గా దీపావళి జరుపుకుంటారు.
నరకాసుర వధ ముల్లోకాలవారికి ఆనందం కలిగిస్తుంది.అప్పటినుండి నరక చతుర్ధశి నాడు అందరూ దీపాలు వెలిగించి ఇంటి గడపల దగ్గర ఉంచి రాత్రి ఉపవాస దీక్షతో జాగరణం చేసి ,మర్నాడు పర్వదినంగా ఆనందోత్సాహలతో బాణాసంచా కాల్చి ,దీపతోరణాలతో గృహాలను అలంకరించి ,రంగవల్లులను ఇండ్ల ముందు తీర్చిదిద్ది పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా మారింది.
దీపావళి రోజు నీళ్లలో గంగ నిండిఉన్నట్లే , నువ్వుల నూనెలో లక్ష్మీదేవి సూక్ష్మరూపంలో నిండిఉంటుంది అనేది మన నమ్మకం. దీపావళి నాడు మహాలక్ష్మిని పూజించడం కృతయుగం నాటినుండి వస్తున్న సంప్రదాయం. అందులోనూ మట్టి ప్రమిదలలో నువ్వులనూనె పోసి,పత్తితో వత్తులు చేసి ,వాటిలో వేసి వెలిగించడం వలన ఆ దీపాలలో మహాలక్ష్మీ అంశ నిండిపోతుంది.
మాములు ప్రమిదలలో వెలిగే జ్యోతులు దీపలక్ష్మికి సంకేతాలుగా పూజింపబడటం దీపావళి పండుగ ప్రత్యేకత .
దీపం వెలుగుకు , ఙ్ఞానానికి ప్రతీక .అమావాస్య చీకట్లను పారద్రోలూతూ ఇండ్లముందు,పూజాగృహంలో వెలిగే దీపాల వరుసలు సర్వశుభాలు అనుగ్రహిస్తాయి.
దీపానికి నమస్కరించి ,లక్ష్మీదేవి స్వరూపంగా దీపాన్ని పూజించడమూ మన సాంప్రదాయమే.
దీపావళికి సంబంధించి రెండో కథ బలిచక్రవర్తికి సంబంధించినది. బలి చక్రవర్తి కూడా అసురుడే. బలిని అంతం చేయడం కోసం విష్ణువు వామనావతారం ఎత్తాల్సి వచ్చింది. మరో కథ భరత్ మిలాప్. అంటే రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్య బయల్దేరి భరతుడ్ని కలిసింది కూడా ఈ రోజే అని చెప్తారు.
దీని మీద భిన్న వాదనలున్నప్పటికీ భరత్ మిలాప్ జరుపుకుంటూనే ఉంటారు.
దీపావళి గురించి ప్రచారంలో ఉన్న మరో కథ విక్రమార్క విజయం. శత్రువులందరినీ గెల్చిన విక్రమార్కుడు తన పేరు మీద శకం ప్రారంభించిన సందర్భంలో కూడా కొందరు దీపావళి జరపుకుంటారు.
దీంతో పాటు మహావీర జైనుడు నిర్యాణం పొందింది కూడా దీపావళి రోజే అంటారు జైనులు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేస్తారు వారు.
దీపానికి మన ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా ప్రాధాన్యతే ఉంది. అలాగే ప్రపంచంలో ప్రతి ప్రాంతంలోనూ దీపాలను పూజించే సాంప్రదాయం ఉంది. ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక ప్రజాసమూహానికో సంబంధించిన పండగ కాదు.
కాస్త ముందు వెనక అన్ని జాతుల వారూ దీపావళి తరహా పండగలు జరుపుకుంటూనే ఉంటారు.
సందర్భాలు ఏవైనా…దీపానికీ మానవ జీవితానికీ చాలా దగ్గర సంబంధమే ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ వెలుగు దారుల వెంట నడవమని చీకటి దారులకు గుడ్ బై చెప్పమనీ దీపావళి సందేశం ఇస్తూనే ఉంటుంది.
చెడు మీద మంచి సాధించిన విజయాన్ని జనం సెలబ్రేట్ చేసుకోవడమే దీపావళి. చెడు మీద యుద్దం చేయడానికి తమను తాము సన్నద్దం చేసుకోవడం దీపావళి పండగ ప్రజలకు ఇచ్చే సందేశం.
ప్రపంచాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఎవరికి వారు పునరంకితం కావాల్సి ఉందనే సందేశాన్ని ప్రపంచానికి అందిస్తుంది దీపావళి.
అందుకే దీపావళి సకల జనుల పండగ…