ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్తో ఓపెనింగ్స్ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్ వైపు వెళ్తున్నారు మేకర్స్. తండ్రీ కొడుకులు కలిసి నటిస్తే ఆడియన్స్‌లో బజ్ పెరుగుతుంది. బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. దీంతో బడా ఫ్యామిలీస్ నుంచి ఫ్యామిలీస్టారర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
చిరంజీవి, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మెగాఫ్యాన్స్కి సూపర్ ఎనర్జీ వస్తుంది. ‘మగధీర, బ్రూస్ లీ’ సినిమాల్లో చిరంజీవి స్పెషల్ రోల్లో కనిపించినప్పుడు థియేటర్లు హంగామా చేశాయి. ఇక ఈ జోష్ని మరింత పెంచడానికి చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో చరణ్ కీ-రోల్ ప్లే చేశాడు. ఏప్రిల్1న బరిలో దిగుతోంది ‘ఆచార్య’.ప్రభాస్ లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’. ‘బాహుబలి, సాహో’ సినిమాల్లో వారియర్, యాక్షన్ స్టార్‌గా కనిపించిన ప్రభాస్, ఈ సినిమాతో వింటేజ్ లవ్‌స్టోరీలోకి వెళ్లాడు. విజువల్ వండర్‌గా కనిపిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘రాధేశ్యామ్’ ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యలేదు.
హీరో, సపోర్టింగ్ రోల్స్ అనే తేడా లేకుండా తెలుగు నుంచి హిందీ వరకు రకరకాల క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు రానా. డిఫరెంట్ జానర్స్తో జర్నీ చేస్తోన్న రానా, రీసెంట్‌గానే చిన్నాన్న వెంకటేశ్‌తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరీస్‌కి సైన్ చేశాడు. బాబాయ్-అబ్బాయ్ కలిసి నటిస్తున్నారనే అనౌన్స్‌మెంట్‌తో ఈ సీరీస్‌పై బజ్ పెరిగింది.
బాలక్రిష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో బరిలో దిగుతాడా అని ఊహల్లో ఉన్న ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు బాలయ్య. ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999’తో మోక్షజ్ఞని లాంచ్ చేస్తానని చెప్పాడు. ఇక ఈ మూవీలో బాలయ్య, మోక్షజ్ఞ ఇద్దరూ హీరోలుగా చెయ్యబోతున్నారు.
రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత జీవిత దర్శకత్వంలో చేసిన సినిమా ‘శేఖర్’. మళయాళీ హిట్ ‘జోసెఫ్’కి రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఇక ఈ మూవీలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కూడా నటించింది. ఈ కథలో తండ్రీ కూతుళ్లు ఇద్దరూ నిజ జీవిత పాత్రలనే పోషించారు. తండ్రీకూతుళ్లుగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి లేదా మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశముంది.
విక్రమ్ వారసుడిని స్టార్ హీరోగా చూడాలని చాలా ఆశ పడుతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్యవర్మ’తో కొడుకుకి ఫాలోయింగ్ వస్తుందని కలలుగన్నాడు. అయితే ధృవ్ యాక్టింగ్‌కి మంచి మార్కులు పడినా, రావాల్సినంత మైలేజ్ రాలేదు. అయితే కొంచెం డల్ ఫేజ్‌లో ఉన్న ధృవ్‌కి ఎనర్జీ ఇస్తూ కొడుకుతో కలిసి ‘మహాన్’ అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా 2022 సెకండాఫ్‌లో రిలీజ్ అయ్యే అవకాశముంది.