ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్ నుంచి మొదలుపెడితే నార్త్ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే ఇద్దరు వారసులు జనాలముందుకొస్తే, మిగతావాళ్లూ బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు.
మహేశ్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘హీరో’ అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఇక ఈ సినిమా అశోక్ హోం బ్యానర్ అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో నిర్మాణమైంది.దిల్ రాజు బ్యానర్లో చాలామంది కొత్త దర్శకులు పరిచయమయ్యారు. వాళ్లు స్టార్ లీగ్‌లో కూడా చేరారు. ఇక ఈ ఏడాది దిల్ రాజు ఇంటి నుంచి ఒక హీరో కూడా లాంచ్ అయ్యాడు. దిల్ రాజు తమ్ముడు.. శిరీష్ కొడుకు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’తో జనాలముందుకొచ్చాడు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో కాలేజ్డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికే రిలీజైంది.
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలున్నారు. బాబాయ్ వెంకటేశ్ తెలుగు మార్కెట్‌ని ఫోకస్ చేస్తోంటే, అబ్బాయి రానా పాన్ ఇండియన్ మార్కెట్ కోసం వెతుకుతున్నాడు. తమిళ్, హిందీల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అన్న రూట్లోనే తమ్ముడు అభిరామ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. తేజ దర్శకత్వంలో హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఇక ఈ మూవీకి ‘అహింస’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు అవుతోంది. ఈ లాంగ్ పీరియడ్‌లో మాస్ హీరోగా ఎదగాలని చాలా కష్టపడుతున్నాడు. అయితే ఈ మాస్ ఇమేజ్ మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అయితే తమ్ముడు మాత్రం మాస్ ఆశలతో కాకుండా సింపుల్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ‘స్వాతిముత్యం’ అనే సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నాడు బెల్లంకొండ గణేష్.
బాలక్రిష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య దర్శకత్వంలో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమాతో హీరోగా లాంచ్ అవుతాడనే టాక్ వస్తోంది. అయితే ఏడాది నుంచి ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2022లోనే స్టార్ట్ అవుతుందని, బాలక్రిష్ణ మనసలు పెడితే ఇదే ఏడాదిలోనే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.
‘వర్షం’తో ప్రభాస్‌కి క్రేజీ హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్ ఇంటి నుంచి మరో హీరో లాంచ్ అవుతున్నాడు. ఇప్పటికే శోభన్ పెద్ద కొడుకు సంతోష్ శోభన్ హీరోగా రాణిస్తున్నాడు. ‘పేపర్‌బాయ్, ఏక్ మిని కథ’ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక శోభన్ చిన్న కొడుకు.. ‘బేకర్ అండ్ బ్యూటీ, త్రీ రోజెస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ లాంటి వెబ్ సీరస్లతో ఆకట్టుకున్న సంగీత్ శోభన్ కూడా ఈ ఏడాది వెండితెరపైకి వస్తున్నాడని, హీరోగా సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.