ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఒక తప్పుడు డిగ్రీ పట్టాతో ప్రభుత్వాన్ని మోసం చేసి తాను ఉద్యోగం చేసిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతి పొందినట్టు ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించడంతో పోలీసులు అశోక్ బాబును అరెస్టు చేశారు. అసలు ఈ వ్యవహారాన్ని ఆయన పనిచేసిన శాఖలోని కొందరు ఉద్యోగులే లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఉద్యోగ సంఘానికి నేతగా ఎదిగి ఆ శాఖలోని ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను బికాం డిగ్రీ చదివినట్టు ఒక సర్టిఫికెట్ అధికారులకు ఇచ్చి పదోన్నతి పొందారు. ఆయన పనిచేసి పదవీ విరమణ చేసిన వాణిజ్య పన్నుల శాఖలో డిగ్రీ సర్టిఫికెట్ ఉంది. కాగా ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు కేవలం ఇంటర్ వరకే చదివినట్టు పేర్కొన్నారు. ఇవన్నీ వాస్తవాలు. ఒకవేళ అవాస్తవాలు అయితే విచారణాధికారులకు చెప్పి, అవి తప్పుడు కేసులు అని నిరూపించి బయటపడవచ్చు. కానీ విచిత్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకొని గల్లీ స్థాయి నేటివరకూ అరెస్టును ఖండించడం టీడీపీ మార్కు రాజకీయం కాక ఇంకేమిటి?
అసలు ఎవరీ అశోక్ బాబు అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అశోక్ బాబు ఆ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధిగా ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ నాన్ గజిటెడ్ అధికారుల సంఘ్గంలోకి ప్రవేశించారు. నెమ్మదిగా, అంచెలంచెలుగా ఎదిగి చివరికి రాష్ట్ర విభజన నాటికి ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల్లోకి వచ్చారు. అయితే రాష్ట్ర విభజన ఆయనకు ఒక వరంగా వచ్చింది. రాష్ట్ర విభజనను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించడంతో అశోక్ బాబు పని బూరెల బుట్టలో పడ్డట్టు అయింది. రాష్ట్ర విభజనను అన్ని రాజకీయ పార్టీలు అప్పటికే వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఒక వ్యవస్థ అవసరం అయింది. పోరాటం ప్రజా పోరాటం అని చెప్పేందుకు రాజకీయాలకు అతీతమైన ఒక వ్యవస్థ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవసరం అనిపించింది. అప్పుడే ఆగమేఘాలమీద అశోక్ బాబును పిలిపించి సమైక్యాంధ్ర ఉద్యమం నడిపే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పగించారు. అయితే అప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మంచి అవగాహన ఉండడంతో ఈ ఇద్దరు నేతలూ కలిసి అశోక్ బాబును ముందు పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమం నడిపించారు.
ఉద్యమానికి నిధులు సమకూర్చడంతో పాటు అజెండా కూడా అటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్దేశించి అశోక్ బాబును సీమాంధ్రలో 13 జిల్లాలు విస్తృతంగా తిప్పారు. “జై సమైక్యాంధ్ర” అంటూ అశోక్ బాబు అటు కిరణ్ కుమార్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఎజెండాను మోస్తూ సీమాంధ్ర అంతటా ఉద్యమం చేశారు. ఎన్జీవోల సంఘం నేతగా తెరముందు అశోక్ బాబు కనిపిస్తుంటే వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఇదేదో ప్రజా ఉద్యమమే అనుకుని రోడ్డుమీదకు వచ్చి అశోక్ బాబు ఇచ్చిన ప్రతి పోరాట రూపాన్ని విజయవంతం చేశారు. రాష్ట్రం విడిపోదు అంటూ ప్రజలను తప్పుదారి పట్టించారు. రాష్ట్రం విడిపోతుంది, మనకు ఏం కావాలో అడిగితె మంచిది అని సూచనలు చేసిన వారి గొంతులు నొక్కేశారు ఈ అశోక్ బాబు.
అలాంటి అశోక్ బాబు రాష్ట్ర విభజన తర్వాత మౌనం వహించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించగానే పూర్వాశ్రమంలో పరిచయం కారణంగా చంద్రబాబు కు దగ్గరయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్జీఓ నేతగా ఉద్యోగస్తులకంటే చంద్రబాబు నాయుడుకే ఆయన ఎక్కువ సేవలు చేశారు. చంద్రబాబు నాయుడు బీజేపీ తో తెగతెంపులు చేసుకున్న తర్వాత మరోసారి ధర్మ పోరాటం అంటూ జరిగిన ఉద్యమంలో అశోక్ బాబు ఉద్యోగసంఘాల నేతగా చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయ పోరాటాల్లో పాల్గొన్నారు. చివరికి కర్ణాటక రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతుంటే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేశారు.
ఇన్ని చేసిన అశోక్ బాబు పదవీవిరమణ చేయగానే ఆయనను తన పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ చేశారు. అలాగే పార్టీలో అధికార ప్రతినిధిగా కూడా నియమించారు. అప్పటి నుండి అటు శాసనమండలిలోనూ, ఇటు టీడీపీ కార్యాలయంలోనూ చంద్రబాబు నాయుడు చెప్పే కుటిల రాజకీయాలను అధికారికంగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సిఐడి అధికారులు తీగ లాగడంతో ఈ డొంక అంతా కదులుతోంది. అయితే నేరాన్ని నేరంగా అంగీకరించే అలవాటు లేని చంద్రబాబు నాయుడు ఈ అరెస్టు రాజకీయం చేసి లబ్ది పొందాలని చూడడం తెలుగు ప్రజలకు కొత్తేమీ కాదు.